ఉపాధ్యాయ దినొత్సవ శుభాకాంక్షలు
నాగటి నారాయణ
Sep 5th 2012
సెప్టెంబర్ 5 మన దేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఎన్నికయినప్పుడు ఉపాధ్యాయ సమాజం ఉప్పొంగి పరవశించింది. ఆ సంవత్సరం తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పటానికి వచ్చిన ప్రముఖులు, అభిమానులతో 'ఈ శుభాకాంక్షలు దేశంలోని ఉపాధ్యాయులందరికీ చెందాలి' అనే రాధాకృష్ణన్ సందేశంతో ఆనాటి (1962) నుంచే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా, జాతీయ పర్వదినంగా చరిత్రకెక్కింది. స్వాతంత్య్ర దినం, రిపబ్లిక్ డే తర్వాత ప్రభుత్వపరంగా దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక రోజుగా అమల్లోకి వచ్చింది. అయితే ప్రభుత్వాల విధానాల్లో పెరుగుతున్న బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం ఫలితంగా ఉపాధ్యాయ దినోత్సవం ప్రతిష్ట, ప్రాధాన్యత క్షీణించిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉదారవాద విధానాలతో ముందుకొచ్చిన సరికొత్త సవాళ్ల సుడిగుండంలో ఉపాధ్యాయుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిపోతున్నది. ప్రాచీనం, మధ్య యుగం, ఆధునికం ఏ కాలంలో అయినా రాచరికంలోనూ, ప్రజాస్వామ్యంలోనూ ప్రభుత్వపరంగా ఉపాధ్యాయులకు మన్నన, గౌరవం లభించింది. విద్యారంగానికి పాలకులు ప్రాధాన్యత ఇచ్చినంత కాలం ఉపాధ్యాయుల ప్రాభవం పరిమళించింది. కానీ ఈనాడు విద్యారంగంలో అమలు చేస్తున్న ప్రైవేటీకరణ, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానాలతో ఉపాధ్యాయ వృత్తి, గురుభక్తి పలుచనైపోతున్నది. ఉపాధ్యాయుల సంక్షేమం సన్నగిల్లిపోతోంది. సమాజంలో ఉపాధ్యాయులు గౌరవప్రదంగా జీవించాలంటే వారి ఆర్థిక స్థితి బాగుండాలి. అందుకోసం మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలుండాలని డాక్టర్ డిఎస్ కొఠారి కమిషన్ 1967లోనే చెప్పింది. ఈనాడు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు కపిల్ సిబల్ కూడా అదే మాట వల్లెవేస్తున్నారు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా వారి పథకాలు, చర్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల జీతభత్యాలు, సదుపాయాల్లో అనేక వ్యత్యాసాలున్నాయి. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పేరుతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతనాలు కూడా చెల్లించటం లేదు. పిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ వంటి సదుపాయాలు లేవు. కనీసం మహిళలకు ప్రసూతి సెలవు కూడా లేదు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ టీచర్లు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కెజిబివి, కంప్యూటర్, గెస్ట్, సిఆర్‌టి, ఐఇఆర్‌టి, తదితర పేర్లతో లక్ష మందికి పైగా ఉన్నారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా మరో లక్ష మంది తాత్కాలిక ఉపాధ్యాయులను అపాయింట్ చేయటానికి రాజీవ్ విద్యామిషన్ సిద్ధమైంది. కేంద్ర ప్రాయోజిత పథకం మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ పద్ధతితో నియమించే ప్రక్రియ నడుస్తోంది. ఇక ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధ్యాయులు ఎంత దోపిడీకి గురౌతున్నారో అందరికీ తెలిసిందే. దేశమంతటా అందరికీ సమానమైన ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యా బోధన ఉండాలని, అందుకు ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం కూడా సమానంగా ఉండాలనే పేరుతో ఉపాధ్యాయుల అర్హతలు, పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులు డిఎస్‌సితో పాటు అదనంగా 'టెట్' కూడా రాయాల్సి వచ్చింది. ఉపాధ్యాయుల నియామకాల్లో తన ఆదేశాలే పాటించాలని పట్టుబడుతున్న కేంద్రం ఉపాధ్యాయుల జీతాలు, సదుపాయాల విషయాన్ని పట్టించుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో సమానంగా చూడటం లేదు. రిటైర్మెంట్ వయస్సు కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో 60 ఏళ్లు ఉంటే ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో 58 సంవత్సరాలే ఉంది. కేంద్ర పాఠశాలల్లోని మహిళా టీచర్లకున్న రెండేళ్ళ చైల్డ్‌కేర్ లీవ్ సదుపాయం రాష్ట్ర పాఠశాలల్లో మహిళా టీచర్లకు లేదు. దేశంలో విద్యా ప్రమాణాల అభివృద్ధికి ఉపాధ్యాయులే ఆటంకంగా ఉన్నారని, ఆధునిక బోధనా పద్ధతులను నేర్చుకొని విద్యార్థులకు బోధించే ప్రయత్నం చేయటం లేదని, అందువలన దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ పున్ణశ్చరణ శిక్షణని వ్వాలని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రకటించారు. కానీ ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ పథకాలతో ఇస్తున్న ట్రైనింగ్‌లు ఉపాధ్యాయులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదని, అధికారుల అవినీతి, నిధుల దుర్వినియోగానికి దారితీస్తున్నాయనే విషయాన్ని పట్టించుకోవటం లేదు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ వంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యాపార సంస్థలతో ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పించే దానికి కూడా ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. మన రాష్ట్రంలోని హైస్కూల్ హెడ్మాష్టర్లను ఇటీవల బెంగళూరు తరలించి శిక్షణ ఇప్పించారు. ప్రథమ్ వంటి సంస్థలతో ఏటా సర్వేలు నిర్వహిస్తూ ఉపాధ్యాయుల పని విధానం బాగులేదని, గైర్హాజరీ పెరుగుతోందని, జవాబుదారీతనం లేదనే బహిరంగ నిందలతో ఉపాధ్యాయులను చులకన చేస్తున్నారు. మరోవైపు మూల్యాంకన ప్రక్రియలోనూ బయటివారి జోక్యాన్ని ప్రోత్సహిస్తూ ఉపాధ్యాయుల నిజాయితీని పరిశీలించే పన్నాగాలు ప్రవేశిస్తున్నాయి. ఉపాధ్యాయుల పని విధానాన్ని, వృత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే నిర్మాణాత్మక చర్యలు చేపట్టకుండా, ఉపాధ్యాయులను విశ్వాసంలోకి తీసుకోకుండా దోషులుగా, డిఫాల్టర్స్‌గా చూసే ధోరణి పెరిగిపోతున్నది. కేంద్ర ప్రభుత్వానికి తోడు రాష్ట్ర ప్రభుతాల ఒత్తిళ్లు కూడా ఉపాధ్యాయులను మరింత వేధిస్తున్నాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, సబ్జెక్ట్ టీచర్లను నియమించకుండా, విద్యార్థుల్లో నిర్దేశిత సామర్థ్యాలు లేకపోతే ఉపాధ్యాయులను శిక్షించాలనే ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. అసంబద్ధమైన రేషనలైజేషన్ చేపట్టి ఉపాధ్యాయులపై పని భారం పెంచింది. క్షేత్ర స్థాయిలో విద్యా శాఖ అధికారులను నియమించకుండా పర్యవేక్షణా యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసింది. ఉపాధ్యాయుల ఆలనాపాలనా చూస్తే యంత్రాంగం లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా తయారవుతోంది. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ అరాచక పరిపాలనతో ఉపాధ్యాయులపై బెదిరింపులు, భౌతిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మార్క్సిస్ట్‌లనే ముద్రవేసి సస్పెన్షన్‌లు, నిర్బంధాలతో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇక బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉపాధ్యాయులను మధ్యయుగాల్లోకి తీసుకుపోతున్నారు. ఉపాధ్యాయులను నవ్వులపాలు చేసే పనిలో మీడియా తన వంతు పాత్ర పోషిస్తోంది. మంచి ఉపాధ్యాయులను ప్రోత్సహించటం కంటే తప్పులు చేసేవారినే ప్రచారంలో పెడుతోంది. వాటితోపాటు నూతన ఆర్థిక విధానాలతో అలుముకొన్న ఆర్థికవాదం, వినిమయ సంస్కృతి ధోరణులు కూడా ఉపాధ్యాయ వృత్తి నిబద్ధతకు పెద్ద సవాల్‌గా పరిణమించాయి. ఇలాంటి సరిక్రొత్త సవాళ్ల సుడిగుండంలో ఎదురీది వృత్తి ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టటానికి ఉపాధ్యాయులు ఆత్మ విమర్శతో, అంకితభావంతో, అకుంఠిత దీక్షతో పనిచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. పది మందికి చెప్పాల్సినవారు ఒకరితో చెప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. మారుతున్న సామాజిక పరిస్థితులు, ప్రభుత్వాల విధానాలను అధ్యయనం చేస్తూ ప్రత్యామ్నాయ విధానాలతో, ప్రతిఘటనా ఉద్యమాలతో, స్వయంకృషితో ప్రజల, తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొనే విధంగా ఉపాధ్యాయుల పని విధానం మరింత పెరగాలి. ఉపాధ్యాయ సంఘాలు తమ వంతు కృషి చేయాలి. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటియఫ్) ఇచ్చిన పిలుపు ఎంతో మేలుకొలుపుగా ఉన్నది. 'ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్ని నిలబెడతాను, మెరుగైన విద్యా బోధనకు స్వయం కృషి చేస్తాను. తరగతి గదిలో సెల్‌ఫోన్ వినియోగించను' అనే స్వీయ ప్రతిజ్ఞ ఉపాధ్యాయుల నిబద్ధతకు ఎంతో మేలు చేస్తుంది.
|
LATEST NEWS:: |